కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ (Gaddar Film Awards) ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ అవార్డుల ఎంపికకు సంబంధించి తుది జాబితాను జ్యూరీ సభ్యులు శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారికంగా అందజేశారు. ప్రజా భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని అవార్డుల ఎంపిక తీరును, విజేతల వివరాలను డిప్యూటీ సీఎంకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, రోజా రమణి, ప్రగతి, సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు కమిటీలోని ఇతర సభ్యులు పాల్గొన్నారు. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా, కళాకారుల ప్రతిభను గౌరవించేలా ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని జ్యూరీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు.

