కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న అభివృద్ధి, పరిపాలన అవసరాలకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్ సిటీ’ కోసం ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిని పున:వ్యవస్థీకరిస్తూ నూతన కమిషనర్లను నియమించింది.
ఫ్యూచర్ సిటీ తొలి కమిషనర్‌గా సుధీర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి మొదటి పోలీసు కమిషనర్‌గా సుధీర్ బాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన, గ్లోబల్ సమ్మిట్ వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ గుర్తింపు పొందారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు.. అవినాష్ మహంతికి బాధ్యతలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను రీఆర్గనైజ్ చేయడంతో నూతనంగా ‘మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్’ ఉనికిలోకి వచ్చింది. ఇప్పటివరకూ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మహంతిని ఈ కొత్త కమిషనరేట్‌కు కమిషనర్‌గా బదిలీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం రాచకొండ పరిధిలోని ప్రాంతాలను వేరు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సైబరాబాద్ కమిషనర్‌గా రమేశ్
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Police Commissionerate)ను కూడా ప్రభుత్వం పున: వ్యవస్థీకరించింది. ఈ క్రమంలో ఐజీగా ఉన్న రమేశ్‌ను సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా నియమించింది. ఐటీ కారిడార్‌తో కూడిన కీలకమైన ఈ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణ ఇప్పుడు ఆయన పర్యవేక్షణలోకి వెళ్లనుంది.
భువనగిరి ఎస్పీగా ఆకాంశ్ యాదవ్
మరోవైపు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరిని విడదీసి ప్రత్యేక జిల్లా పోలీస్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకూ రాచకొండ డీసీపీగా పనిచేసిన ఆకాంశ్ యాదవ్‌ను భువనగిరి జిల్లా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


