కలం మెదక్ బ్యూరో: వైద్య రంగంలో సాంకేతికత పెరిగి సంతానం కోసం ఫెర్టిలిటీ, ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి వివిధ రకాల అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కొందరి ఆలోచన సరళిలో మాత్రం మార్పు రావడం లేదు. తొమ్మిది నెలలు గర్భంలో మోసిన, కడుపున పుట్టిన కన్న బిడ్డలను దూరం చేసేలా శిశు విక్రయాలు నేటికి జరుగుతున్నాయి. ఏఐ జమానాలోను మెదక్ (Medak) జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న శిశు విక్రయాల సంఘటనలు అందోళనలకు గురిచేస్తున్నాయి.
తల్లికి తెలియకుండా శిశువును విక్రయించిన నర్సులు
మెదక్ పట్టణంలోని కేర్ ఆస్పత్రి () లో జరిగిన శిశు విక్రయం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికి తెలియకుండానే నర్సులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును విక్రయించిన సంఘటన సంచలనంగా మారింది. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ చెందిన ఫాతిమా గతనెల 12వ తేదిన డెలివరీ కోసం మెదక్ టౌన్‌లోని కేర్ హస్పిటల్‌లో చేరింది. వైద్యులు డెలివరీ చేయడంతో ఆడబిడ్డ పుట్టింది. అయితే తర్వాత వైద్య పరీక్షల పేరుతో హస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సులు ఉన్నీస, నిలోఫర్ లు పురిటి పాపను తీసుకెళ్లి మళ్లీ తీసుకురాలేదు. ప్రసూతి సమయంలో రక్తస్రావం ఎక్కువగా కావడం వల్ల పుట్టిన బిడ్డ చనిపోయిందని నర్సులు ఫాతిమా భర్త అస్లాంఖాన్‌కు చెప్పి నమ్మించారు. ఈ ఆడ శిశువును సిద్దిపేటకు చెందిన ఇక్బాల్, అక్తరి బేగంకు రూ. 1 లక్షా 50 వేలకు అమ్మేశారు నర్సులు. పాప చనిపోయిందని భావిస్తున్న ఫాతిమా దంపతులకు తమకు పుట్టిన బిడ్డ బతికి ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో పాప తల్లిదండ్రులు కేర్ హస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీసి, మెదక్ టౌన్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో నర్సులు శిశువును అమ్మిన విషయం బయటపడింది. శిశువును అమ్మిన కేర్ ఆస్పత్రిలోని ఇద్దరు నర్సులు, శిశువు కొనుగోలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు మెదక్ పోలీసులు.
ఆర్ధిక ఇబ్బందులతో బాబును విక్రయించిన తల్లిదండ్రులు
హవేలీ ఘనపూర్ మండలం లింగసానిపల్లి తాండాకు చెందిన గిరిజన మహిళ మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఫిబ్రవరి 10వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చింది.పేగు తెంచుకొని పుట్టిన బాబును తల్లిదండ్రులే అమ్ముకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల పేరుతో మద్యవర్తి ద్వారా కామారెడ్డికి చెందిన దంపతులకు లక్షా 70 వేలకు కడుపున పుట్టిన బాబును విక్రయించారు. అయితే బాబు పుట్టిన తరువాత అంగన్వాడీలో పాలు, ఇతర పోషకాహరం తీసుకోవడానికి బాలింత రాకపోవడంతో గ్రామ అంగన్వాడీ టీచర్‌కు అనుమానం వచ్చి ఆరా తీసింది. మీ బాబు ఎక్కడ ఉన్నాడని అంగన్వాడీ టీచర్ గట్టిగా ప్రశ్నించడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులు, పోలీసులకు అంగన్వాడీ టీచర్ చెప్పడంతో మగశిశువును లక్షా 70 వేలకు తల్లిదండ్రులు విక్రయించినట్లు తేలింది.
మెదక్ జిల్లాలో శిశువిక్రయాలు గతంలో పోల్చితే తగ్గినా.. ఇప్పటికే కొనసాగుతుండటం అందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లోని తండాల్లో ఉండే గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో శిశువులను అమ్ముకుంటున్నారు. మరోవైపు సంతానం లేని వారి అవసరాన్ని ఆసరా చేసుకొని, వారి దగ్గర భారీగా డబ్బులు తీసుకుంటూ అమాయక మహిళలను ఒప్పించి పిల్లలను విక్రయిస్తున్నారు మరికొందరు. శిశు విక్రయాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు, కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత మహిళా, శిశు అభివృద్ధి శాఖ పైన, సంబంధిత అధికారులపైన ఉన్నది.

