కలం, వెబ్ డెస్క్: ఆ అమ్మాయిది మారుమూల గ్రామం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే పల్లె. సౌకర్యాలు అంతంత మాత్రమే. అయినా సరే కలలను కనడం ఆపలేదు. సాధారణంగా గ్రామీణ యువతులు హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. కట్టుబాట్లు, సాంప్రదాయాల మాటున నలిగిపోతుంటారు. అలాంటి చోట నుంచి మోడలింగ్‌లోకి అడుగుపెట్టి వారెవ్వా అనిపించుకుందీ అమ్మాయి. ఇటీవల జరిగిన ‘మిస్ రాజస్థాన్’ (Miss Rajasthan) షోలో ర్యాంప్‌పై హొయలు ఒలకబోసి అందర్నీ కట్టిపడేసింది.
ఈ అమ్మాయిది మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడదు. ఒకవైపు కుటుంబ బాధ్యతల్లో భాగమవుతూనే, మరోవైపు ఇంటి రూఫ్‌పై ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసేది. టూత్ బ్రష్‌తోనే మేకప్ వేసుకునేది. పాత బట్టలనే స్టైలిష్‌గా మార్చి ధరించేది. ర్యాంప్ వాక్ వీడియోలను తన మొబైల్‌తోనే షూట్ చేసేది. ఇంట్లో అయితే బెడ్ షీట్లను కార్పెట్స్ లా మార్చేసి అందమైన ఫోజులతో ఆకట్టుకునేది.
పొలాల్లో పనిచేసినప్పుడు ఆమె పాదాలకు గాయాలయ్యేవి. అవి కనిపించకుండా టిప్స్ పాటించేది. ఈ క్రమంలో చాలామంది తిట్టినా తన ప్రయాణం ఆపలేదు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన మిస్ రాజస్థాన్ పోటీల్లో జిగేల్ మంటూ మెరిసింది. భవిష్యత్తులోనూ తన ప్రయాణం ఆగదని, పెద్ద మోడల్ కావడమే తన లక్ష్యం అని చెప్పింది. అలాగే తనలాంటి గ్రామీణ అమ్మాయిలకు మోడలింగ్‌లో రాణించేలా చొరవ తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మాయి వీడియో వైరల్ కావడంతో యు ఆర్ గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.


