కలం, స్పోర్ట్స్: భారత్ తొలిసారి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, స్వదేశంలో ఆడటం భారత ఫెన్సర్ కరణ్ సింగ్‌కు (Karan Singh) ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. అయితే ఆ గర్వంతో పాటు అదనపు ఒత్తిడి కూడా ఉందని ఆయన వెల్లడించాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోటీ పడిన కరణ్, ఆ ఒత్తిడిని అధిగమించి తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. కరణ్ సింగ్ ఫెన్సింగ్ ప్రయాణం 2010లో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బెహ్రోర్ గ్రామంలో ప్రారంభమైంది. గ్రామానికి చెందిన ఒక అథ్లెటిక్స్ కోచ్ ద్వారా ఆయనకు ఫెన్సింగ్ గురించి తెలిసింది. ఆ క్రీడపై ఆసక్తి పెరగడంతో అదే తన కెరీర్‌గా మారింది.
ఆసక్తిగా మొదలైన ప్రయాణం క్రమంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు పలు పతకాలు అందించిన కరణ్, ఫెన్సింగ్ తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు. 2021 నుంచి ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్న ఆయన, అక్కడ ప్రపంచ స్థాయి ఫెన్సర్లతో కలిసి సాధన చేయడం తన ఆటను మరింత మెరుగుపరిచిందని వివరించాడు. కరణ్ (Karan Singh) కెరీర్‌లో అత్యంత భావోద్వేగ క్షణం పారిస్ ఒలింపిక్స్ అర్హత పోరాటం. ప్రపంచ ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేకపోయిన ఆయనకు జోనల్ క్వాలిఫికేషన్ టోర్నీ చివరి అవకాశం అయింది.
అయితే అక్కడ రెండో స్థానంలో నిలవడంతో ఒలింపిక్స్ బెర్త్ చేజారిపోయింది. ఆ నిరాశ కొంతకాలం వెంటాడినా, తర్వాత సానుకూల దృక్పథంతో ముందుకు సాగినట్లు కరణ్ తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఫెన్సర్లతో కలిసి సాధన చేయడం వల్ల పెద్ద వేదికలపై ఆత్మవిశ్వాసంతో ఆడగలుగుతున్నానని ఆయన చెప్పాడు. హంగేరీకి చెందిన మూడు సార్లు ఒలింపిక్ చాంపియన్ ఆరోన్ స్జిలాగీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఆటతీరును గమనిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని వెల్లడించాడు.

