కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా చేగుంట మండలం (Chegunta Murder) అనంతసాగర్ వద్ద ఈనెల 22న జరిగిన యాట శ్రీధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలు నేపథ్యంలో హత్యకు పాల్పడ్డ తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఈనెల 22 న చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ అనే వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన తెలిసిందే.
తూప్రాన్ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్, అదే గ్రామంకు చెందిన రణబోయిన ప్రభు వద్ద ఒక ఆటో కొనుగోలు చేశారు. దీని ఈఎంఐ చెల్లింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొంది, మరోవైపు శ్రీధర్ కు వరుసకు చెల్లె అయినా బంధువును ప్రభు ప్రేమ పేరిట రెండవ వివాహం చేసుకోవడంతో ప్రభువుపై బంధువులు దాడి చేశారు. ఈ దాడికి శ్రీధర్ కారణమని భావించిన ప్రభు , శ్రీధర్ పై కక్ష పెంచుకున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 22న శ్రీధర్, ప్రభు ఒకరికొకరు ఫోన్ చేసుకుని వాదోపవాదాలు చేసుకున్నారు.
చేగుంటకు వస్తే నీ అంత చూస్తానంటూ ప్రభు తెలపడంతో ఆవేశంతో శ్రీధర్ మరొక వ్యక్తిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వచ్చాడు. అతని కోసం వేచి చూసిన ప్రభు తో పాటు అతని బంధువులు 9 మంది ఆటోలో శ్రీధర్ ను వెంబడించారు. అనంతసాగర్ వద్ద ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో శ్రీధర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడి నుండి రెండు ఆటోలలో ప్రభుతో పాటు తొమ్మిది మంది పరారీ అయ్యారు.
ఈ కేసులో ప్రభుతో పాటు అతని అక్క తుపాకుల శోభ, పెండ్యాల శ్రీకాంత్, తుపాకుల మహేష్, చింతల ప్రశాంత్, సంద్రు గణేష్, యాట శ్రావణి, రణబోయిన మహేశ్వరి, చింతల సంధ్య లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం, 9 ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించినట్టు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.

