కలం, వెబ్ డెస్క్: కష్టపడే తత్వం, సాధించాలనే సంకల్పం, నిరంతరం సాధన ఉండాలేకానీ.. ఎంతటి లక్ష్యమైనా చేరుకోవచ్చు. ఓ అస్సాం (Assam) కుర్రాడు తీవ్ర పేదరికాన్ని జయించి అద్భుత విజయం సొంతం చేసుకున్నాడు. సోనిత్‌పూర్ జిల్లాకు చెందిన విక్రమ్ ఛెత్రి (Vikram Chhetri) జీవితం చిన్నప్పట్నుంచే అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండేళ్లకే తల్లిని, 11 ఏళ్లకే తండ్రిని కోల్పోయిన విక్రమ్ ఒంటరివాడయ్యాడు. ఆడుకోవాల్సిన వయసులో ఇంటి పనులు, వంట నేర్చుకుంటూ తనను తాను పోషించుకున్నాడు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేకపోయినా కిరోసిన్ దీపం, సోలార్ లైట్ వెలుతురులో ఏళ్ల తరబడి చదువుకున్నాడు. ప్రభుత్వ సాయం, చుట్టుపక్కల వారి సహకారంతో అడ్డంకులను అధిగమిస్తూ విద్యను ఆయుధంగా మార్చుకున్నాడు.
విక్రమ్ పట్టుదలకు ప్రతిఫలంగా 12వ తరగతి (ఆర్ట్స్) పరీక్షల్లో 89.4 శాతం మార్కులతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. పరీక్షలకు కేవలం రెండు నెలల ముందు పాఠశాల ప్రిన్సిపల్ కాజల్ బోరా, స్థానికుల కృషితో అతని ఇంటికి విద్యుత్ కనెక్షన్ లభించింది. ఏ సౌకర్యాలు లేకపోయినా కేవలం సంకల్ప బలంతో ఉత్తమ ఫలితాలు సాధించాడు. విక్రమ్, భవిష్యత్తులో సమాజానికి సేవ చేసి అస్సాం (Assam) రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కలలు కంటున్నాడు. విక్రమ్ (Vikram Chhetri) ప్రయాణం ఎంతోమంది యువతకు స్పూర్తిగా నిలుస్తోంది.
Read Also: బిట్‌కాయిన్ సునామీ: $80,000 రికార్డ్.. ఆగని బీటీసీఎఫ్ఐ క్రేజ్!
Follow Us On: WhatsApp

