కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran) యుద్ధం ముగింపు, మిడిల్ ఈస్ట్‌లో శాంతి కోసం అందరూ ఆకాంక్షిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కాల్పుల ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. ఇక భవిష్యత్తులో కూడా చర్చలు ఉండబోవన్నారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చర్చల పేరుతో చాలా సమయం వృథా చేసిందన్నారు.
ఇటీవల పాక్ మధ్య వర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులకు పరిస్థితులు సర్దుకుంటాయని అంతా భావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరతకు కూడా ముగింపు పడుతుందనుకున్నారు. కానీ, మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆ దేశ ప్రతినిధులంతా మోసగాళ్లని ట్రంప్ ఆరోపించారు. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలుస్తోంది.

