కలం, జోగుళాంబ గద్వాల: ప్రపంచ జోనోసిస్ డే(World Zoonosis Day) సందర్భంగా జోగుళాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ పశు వైద్యశాలలో సోమవారం పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు వేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి. వెంకటనారాయణ స్వయంగా కుక్కలకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్కల ద్వారా మనుషులకు సోకే రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని, పెంపుడు జంతువుల యజమానులు తప్పనిసరిగా సకాలంలో యాంటీ రాబిస్ టీకాలు వేయించాలని సూచించారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా పెంపుడు కుక్కలను రక్షించడంతో పాటు కుటుంబ సభ్యులు, సమాజాన్ని కూడా రేబిస్ ముప్పు నుంచి కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని పెంపుడు జంతువుల యజమానులకు రేబిస్ నివారణపై అవగాహన కల్పించారు.

