కలం, కరీంనగర్ బ్యూరో: మామిడి సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంటను సాధించి రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మామిడి వర్క్‌షాప్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మామిడి సాగులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. వర్క్‌షాప్‌లో ఉద్యాన శాఖ నిపుణులు నాణ్యమైన మొక్కల ఎంపిక, శాస్త్రీయ పద్ధతుల్లో తోటల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి యాజమాన్యం, సమతుల్య ఎరువుల వినియోగం, పురుగు–తెగుళ్ల సమగ్ర నివారణ, పంట అనంతర నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై రైతులకు సవివరంగా వివరించారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ విధానాలను అవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు. మామిడి వంటి ఉద్యాన పంటలు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, నాణ్యమైన నాట్లు, నీటి సంరక్షణ పద్ధతులు, ఉద్యాన పంటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు విధానాలతో ముందుకు సాగాలని, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, ఉద్యాన రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మరియు ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

