కలం, నిర్మల్ : రెండవ ఏఎన్‌ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ.. 2024లో రెండవ ఏఎన్‌ఎంల నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష మెరిట్ జాబితాను వెంటనే విడుదల చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌సీడీ ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. రెండవ ఏఎన్‌ఎంల ఈపీఎఫ్, పీఎఫ్ సొమ్మును ప్రతి నెల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ చేయాలన్నారు. ఉద్యోగ బాధ్యతలకు సంబంధం లేని పనులను అప్పగించడం నిలిపివేయాలని కోరారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

