నాలుగు కొత్త స్కీమ్స్.. బడ్జెట్‌లో ఫండ్స్…

కలం, తెలంగాణ బ్యూరో : రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (Telangana Budget 2026) సమర్పించడానికి ముహూర్తం ఖరారైంది. నాలుగు కొత్త స్కీమ్‌లను (Four New Schemes) ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా ప్రకటించనున్నది. ఇందుకు అవసరమైన నిధులను కూడా ఇందులో కేటాయించనున్నది. ఆర్థిక శాఖ రూపొందించిన ఈ బడ్జెట్‌ను మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సమావేశమై ఆమోదం తెలపనున్నది. ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా బడ్జెట్‌ను మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అర్చకులకు ప్రతి నెలా పింఛను, రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత ప్రమాద బీమా, పారా అథ్లెట్లకు వారివారి జిల్లాల్లో ఇంటి స్థలం, అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. వీటిని ప్రభుత్వం ప్రకటించనున్నది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే ప్రకటించిన హెల్త్ స్కీమ్‌కు అవసరమైన నిధులను కూడా ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నది.

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా ప్రమాద బీమా :

రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ప్రభుత్వం ఒక వినూత్న స్కీమ్‌కు శ్రీకారం చుట్టనున్నది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రసూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నది. లబ్ధిదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్సు కంపెనీలకు చెల్లిస్తుంది. లబ్దిదారులు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం లేదా ఫైర్ యాక్సిడెంట్.. ఇలాంటి అనుకోని ప్రమాదాల బారిన పడితే ఇన్సూరెన్సు కంపెనీలు బాధితుల కుటుంబానికి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేస్తాయి. ఈ స్కీమ్‌ లబ్ధిదారుల అర్హతలను, మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నది. రాష్ట్రానికి చెందిన వారందరికీ ఈ స్కీమ్ వర్తించనున్నది. ఇందుకు ఏ మేరకు నిధులు అవసరమో ప్రభుత్వం అంచనా వేసింది. బడ్జెట్‌లోనూ (Telangana Budget 2026) కేటాయింపులు చేయనున్నది. దానికి అనుగుణంగా త్వరలో గైడ్‌లైన్స్ విడుదల కానున్నాయి.

వృద్ధాప్య అర్చకులకు ప్రతి నెలా పింఛన్ :

రాష్ట్రంలో వృద్ధాప్యంలో ఉన్న అర్చకుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛను అందచేయాలని భావించింది. డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులను ఇటీవల కలిసిన బ్రాహ్మణ పరిషత్, అర్చకుల సంఘం ప్రతినిధులు ఆర్థిక పరిస్థితులను వివరించారు. ప్రతి నెలా రూ. 30 వేల వరకు పింఛను సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి అర్చకులు దాదాపు 3000 మంది ఉంటారని అంచనా. వీరికి కనీసంగా రూ. 20 వేల చొప్పున పింఛను ఇచ్చేలా నిధులను వార్షిక బడ్జెట్‌లో కేటాయించే అవకాశమున్నది. ఇప్పటికే వారికి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. గత ప్రభుత్వం ధూపదీప నైవేద్యం స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. వారికి గౌరవ వేతనాన్ని కూడా ప్రతి నెలా అందించే స్కీమ్ కొనసాగుతూ ఉన్నది.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ :

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid Day Meal Scheme) కొనసాగించే స్కీమ్‌ను కూడా ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొననున్నది. దీని ద్వారా 430 కాలేజీల్లో చదువుతున్న సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనున్నది. ప్రతి ఒక్కరికి సగటున రూ. 14 చొప్పున నెలకు దాదాపు రూ. 180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, హైస్కూల్స్ లో అమలు చేయడానికి వీలుగా నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్లు పెరగడమే కాకుండా డ్రాపౌట్స్ తగ్గే అవకాశమున్నదని, గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నది ప్రభుత్వ భావన.

పారా అథ్లెట్లకు సొంత జిల్లాల్లో ఇంటి స్థలం :

ఇతర క్రీడాకారులకు సమానంగా పారా అథ్లెట్లను సైతం ప్రోత్సహించడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నది. సుమారు 300 మంది పారా అథ్లెట్లకు వారి సొంత జిల్లాల్లోనే 150-200 చ.గ. చొప్పున ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలాన్ని ఇస్తామని ఈ బడ్జెట్ ద్వారా ప్రకటించే అవకాశమున్నది. స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తున్న రాష్ట్ర సర్కార్ పారా అథ్లెట్ల విషయంలోనూ మామూలు క్రీడాకారులకు ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యాన్ని ఇవ్వాలని భావిస్తున్నది. అందులో భాగమే ఈ స్కీమ్‌లను అమలు చేయడమని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

గతంకంటే 8% పెరగనున్న బడ్జెట్ :

ప్రతి ఏటా బడ్జెట్ సగటున 14% మేర పెరుగుతుందని సాధారణ అంచనా. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కనీసం 8% మేర పెరిగే అవకాశమున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. గత బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లతో రూపొందితే ఈసారి అది రూ. 3.29 లక్షల కోట్లకు పెరగొచ్చని తెలిసింది. సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తి, అన్ని సెక్షన్ల ప్రజలకు ప్రభుత్వ చేయూత, గత ప్రభుత్వ అప్పులు, వాటి మీద వడ్డీల చెల్లింపు అవసరాలు.. వీటన్నింటి కారణంగా ఖర్చు పెరుగుతున్నది. ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి మార్గాలను అన్వేషిస్తూనే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ ప్రాజెక్టులకు గ్రాంట్ల రూపంలో సాయం అందుతుందని, మరికొన్నింటికి వివిధ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల నుంచి రుణాల రూపంలో సమకూరనున్నాయి.

Read Also: సినిమాలకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌ను మారుస్తాం : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>