కలం, వెబ్ డెస్క్: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు (Kavuri Sambasiva Rao) కన్నుమూశారు. 82 ఏళ్ల ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఇటీవల ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. కావూరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూడు సార్లు మచిలీపట్నం, రెండు సార్లు ఏలూరు నుండి మొత్తం ఐదు పర్యాయాలు ఆయన ఎంపీగా గెలిచారు. 2014 ఏప్రిల్‌లో రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కావూరి సాంబశివ రావు 1943లో కృష్ణా జిల్లాలోని గుడ్ల వల్లేరులో జన్మించారు.1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. స్థానిక రాజకీయ కార్యకలాపాలు, పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1989లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు మచిలీపట్నం ఎంపీగా గెలుపొంది సేవలు అందించారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు ఏలూరు నుంచి ఎంపీగా గెలుపొందారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కావూరి కేంద్రమంత్రిగా సేవలు అందించారు. 2012–2014 కాలంలో కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటోమొబైల్, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన విధానాలపై ఆయన పని చేశారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో కొనసాగారు. కొంత కాలం బీజేపీకి ఆయన సేవలందించారు. బీజేపీకి సీనియర్ సలహాదారుగా ఉంటూ రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధానంగా ఏపీలో పార్టీ అభివృద్ధిపై సలహాదారుగా వ్యవహరించారు. బీజేపీ తరఫున ఎక్కడా పోటీ చేయకపోయినా పార్టీ నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.
కావూరి (Kavuri Sambasiva Rao) స్థాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పలు నిర్మాణాలు చేపట్టింది. రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఆయన కంపెనీ ఎంతో కీలకంగా పని చేసింది.ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో రాజకీయాల్లో, వ్యాపార రంగంలో ప్రభావం చూపిన నేతగా కావూరి గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన కృషి చేశారు.
Read Also: పదేళ్లుగా కల్తీ పాలు.. జగన్ ఏం చేశాడు?: వైఎస్ షర్మిల
Follow Us On : WhatsApp

