కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది మండల (Kandi Mandal) కేంద్రంలో పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (ఎల్లమ్మ) ఆలయాన్ని కొందరు హిజ్రాలు కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయం పక్కనే నివాసం ఉంటున్న హిజ్రాలే కూల్చివేతకు పాల్పడ్డారని తెలియడంతో వారు వారి నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఆలయాన్ని కూల్చివేసింది తామేనని అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాకుండా, తామే స్వయంగా ఆలయాన్ని తిరిగి నిర్మించి ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాల సమయంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఆలయాన్ని కూల్చివేసే స్థాయికి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను, అధికారులను డిమాండ్ చేశారు.

