కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ పంటలైతే కొనుగోలు చేస్తుందో, వాటిని మాత్రమే రాష్ట్రం కొంటుందని ప్రకటించడం చూస్తుంటే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిపేట లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని, అలాంటప్పుడు మిగతా 75 శాతం పంటను ఎవరు కొనుగోలు చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వరి, పత్తితో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, శనగలు, పెసర్లు, కందులు లాంటి అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇతర పంటలు వేసిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటల గురించి పదే పదే మాట్లాడే ప్రభుత్వం, ఆ పంటలపై రైతులకు కనీస అవగాహన కల్పించకపోగా.. ఆ ప్రత్యామ్నాయానికి కనీస భరోసా కూడా ఇవ్వలేకపోవడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన బాధలో, వేదనలో ఉంటే ఏ పంట వేసినా ‘మేమున్నాం’ అంటూ ధైర్యాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం, ఇలాంటి దారుణమైన కండిషన్స్ పెట్టడం ముమ్మాటికీ రైతు వ్యతిరేక చర్యేనని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు.
మార్కెట్లో యూరియాను అందుబాటులో ఉంచకుండా కొరత సృష్టించి, ధరలు పెంచి, యాప్‌ల ద్వారా అమ్మకాలు జరుపుతూ రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు ఎరువుల ధరలు, మరోవైపు డీజిల్ ధరలు పెరిగి, సకాలంలో కరెంట్ రాక పంటలు ఎండిపోతుంటే, పండించిన పంటకు సరైన ధర రాక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)

