కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులను వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్ (VP Gautham) అధికారులను ఆదేశించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారికి పంటల మార్పిడి లక్ష్యాలను నిర్దేశించి, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
బుధవారం వనపర్తి (Wanaparthy) జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎల్‌నినో పరిస్థితులు, పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 18 శాతం లోటు నమోదైందని అధికారులు వివరించారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ, ఒకసారి నీటి నింపుదలతో ఉమ్మడి జిల్లా పరిధిలోని 5 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులలో కొద్దిరోజుల వర్షాలను చూసి రైతులు వరి సాగుకు మొగ్గు చూపకుండా వాస్తవ పరిస్థితులను వివరించి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని గౌతమ్ సూచించారు.
జిల్లాలో వేరుశెనగ సాగును 40 వేల ఎకరాలకు, మినుముల సాగును 30 వేల ఎకరాలకు పెంచేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కందులు, ఇతర తక్కువ నీటి అవసరమున్న పంటలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఏడాదికి 6 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 7 వేల ఎకరాలలో కూరగాయల సాగు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, రూఫ్ రీప్లేస్‌మెంట్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇతర సామగ్రి సకాలంలో అందేలా చూడాలని సూచించారు. మిషన్ భగీరథ అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గౌతమ్ ఆదేశించారు.

