కలం, కోరుట్ల : కేంద్రంలోని బిజెపి పరిపాలనలో ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ ఈ నెల 6 నుండి 14 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే ప్రచార పాదయాత్రలు, సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ (CPI) జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం పిలుపునిచ్చారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని సిపిఐ భవన్లో పాదయాత్రల వాల్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ, మూడోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా నిత్యవసర ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని సార్వత్రిక విద్య ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని మహిళా రిజర్వేషన్లు అమలు, పంటలకు కనీస మద్దతు ధర తదితర డిమాండ్లతో కోరుట్లలో 6 నుండి 14 వరకు ప్రారంభమైన ప్రచార యాత్రను విజయవంతం చేయాలని తెలిపారు.
అధికారం మారుతుంటేనే ప్రజా సమస్యల పరిష్కారం మార్గం ఉంటుందని ప్రజలు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, నాయకులు ఎండి ముక్రం, రామిల్ల రాంబాబు, ఎండి ఉస్మాన్, ఏ.రాధా, అందే వంశీకృష్ణ, ఎండి సమీర్, ఎండి గని పాల్గొన్నారు.

