సంగారెడ్డి జిల్లాలో జర్నీ యమ డేంజర్ గురూ!

కలం మెదక్ బ్యూరో: గ‌త వారంరోజులుగా సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా రహదారులు (Sangareddy Roads) దెబ్బతిన్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా రహదారులు గుంత‌ల‌మ‌యంగా మారాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. దారిపొడవునా పెద్ద పెద్ద గుంతలు తేలి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారుల గుండెల్లో గుబులు మొదలవుతోంది.

నిత్యం నరకం

భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై ప్రయాణం నరకప్రాయంగా మారింది. వర్షాలకు తారు రోడ్లు కొట్టుకుపోయి, అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బ‌య‌ట‌కు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ గ‌తుకుల రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల కార‌ణంగా వాహనాలు నెమ్మదించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యల ఏర్పడుతోంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక నడుము, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు బాధిస్తున్నాయని పలువురు వాపోతున్నారు.

వినూత్న నిరసనలు

మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ప్రాతినిద్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంలోనూ రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నాందేడ్ హైవే నుంచి పుల్కల్ మండల కేంద్రం మీదుగా సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు గుంత‌ల‌మ‌యంగా మారింది. అలాగే సంగారెడ్డి పట్టణంలోని ప‌లు కాల‌నీల‌ రోడ్లు ఘెరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బైపాస్ రోడ్డు నుంచి దువా హాస్పిటల్ వరకు రహదారి కొట్టుకుపోయింది. ఐటీ ఉద్యోగులు ఎక్కువ‌గా ఉండే పటాన్‌చెరు నియోజకవర్గంలో రోడ్లు నరకప్రాయంగా మారాయి. నిత్యం రాకపోకలు కొనసాగే శ్రీదేవి ధియోట‌ర్ నుంచి అమీన్ పూర్ ప్రధాన ర‌హ‌దారి గుంత‌ల మ‌యంగా మారింది.

వర్షాలు వస్తున్నాయని తెలిసినా అధికారులు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల మరమ్మతులు చేయాల్సిన అర్అండ్‌బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా క‌న్పిస్తుంది. కనీసం తాత్కాలికంగా గుంతలు పూడ్చే ప్యాచ్ వర్క్ పనులు కూడా చేపట్టకపోవడంతో విమర్శలొస్తున్నాయి. పలు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిర‌స‌న‌లు చేస్తున్నారు. నీరు నిలిచిన గుంతల్లో వరి నాట్లు వేస్తూ, అధికారుల తీరుపై నిరసనలు తెలుపుతున్నారు. అయినా అధికారుల్లో, నాయకుల్లో చలనం కనిపించడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>