కలం, వరంగల్ బ్యూరో : నర్సంపేట రాజకీయాలు (Narsampet Politics) అంటే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) పేరు తప్పనిసరిగా వినిపించేది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన, ఉద్యమ నాయకుడిగానే కాకుండా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో నర్సంపేటలో రాజకీయంగా ఒక శూన్యత ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి రానున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
బీఆర్ఎస్‌కు పెద్ద పరీక్ష
పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపై ఉంచగల నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు లేకపోవడంతో బీఆర్ఎస్ ముందున్న మొదటి సవాల్ నాయకత్వాన్ని నిలబెట్టడమే. పార్టీ అధిష్ఠానం ఎవరిని ముందుకు తీసుకువస్తుంది? కుటుంబానికి అవకాశం ఇస్తుందా? లేక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. నర్సంపేట నియోజకవర్గం జనరల్ స్థానం కావడంతో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కన్నేసినట్టు తెలుస్తోంది.
వరంగల్ కు చెందిన ఎమ్మెల్సీ తో పాటు మాజీ మంత్రి కూడా ఆసక్తి కనబడుతున్నట్లు సమాచారం. కేవలం అభ్యర్థిని ప్రకటించడం సరిపోదు. పెద్ది అనుచరులు, స్థానిక నాయకులు, గ్రామస్థాయి క్యాడర్‌ను సమన్వయం చేయడం కూడా పార్టీకి కీలక పరీక్షగా మారనుంది. ఈ దశలో చిన్నపాటి అసంతృప్తులు కూడా భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు కలిసి వచ్చే పరిస్థితులా?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుందని చర్చ సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వర్గాలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. నర్సంపేటలో ఇప్పటి వరకు బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన కొన్ని వర్గాల్లో మార్పు వస్తే, కాంగ్రెస్‌కు అది రాజకీయంగా లాభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు వినికిడి.
బీజేపీకి అవకాశాల వేదిక
ఇటీవలి కాలంలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ, నర్సంపేటను కూడా వ్యూహాత్మకంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా అధికార పోరులో లేకపోయినా, ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువత, మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లు, ప్రధాన పార్టీల పట్ల అసంతృప్తి ఉన్న వర్గాలను ఆకర్షించడంపై బీజేపీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఓటు బ్యాంకే కీలకం
నర్సంపేట రాజకీయాల్లో వ్యక్తిగత ప్రభావం, సామాజిక సమీకరణాలు, గ్రామస్థాయి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిగత ఓటు బ్యాంకు ఏ దిశగా వెళ్తుందనేది రాబోయే రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. బీఆర్ఎస్ ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ దానిలో చీలిక తీసుకురాగలదా? లేక బీజేపీ తన వాటాను పెంచుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం
నర్సంపేటలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కేవలం ఒక నాయకుడి స్థానాన్ని భర్తీ చేసే అంశానికి మాత్రమే పరిమితం కావడం లేదు. నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యాన్ని ఎవరు కొనసాగిస్తారు? ఏ పార్టీ కొత్త నాయకత్వాన్ని నిలబెడుతుంది? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. బీఆర్ఎస్‌కు ఇది నాయకత్వాన్ని నిరూపించుకునే సమయం కాగా, కాంగ్రెస్‌కు విస్తరణకు అవకాశం, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అనుకూల వాతావరణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నర్సంపేట రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇక నుంచి ప్రతి రాజకీయ అడుగు, ప్రతి పార్టీ నిర్ణయం నియోజకవర్గ భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

