కలం, వరంగల్ బ్యూరో : ఓరుగల్లులో సోమవారం మాజీ మావోయిస్టుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇటీవల ఛత్తిస్ ఘడ్ లో పోలీసుల ఎదుట లొంగిపోయిన వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టులు ఇంటి బాట పట్టారు. తమ కుటుంబీకులు, ఉద్యమంలో కలిసి పనిచేసిన సహచరులు వారి కుటుంబాలను కలుసుకునే ప్రయత్నంలో ఈ సమ్మేళనం నిర్వహించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.
ఇందులో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంచార్జి తక్కళ్లపెల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, రాజమన్ భాస్కర్, వెంకటేష్, శ్యామ్, రజిత తదితరులు పాల్గొన్నారు. అయితే వారంతా ఉద్యమంలో ఉండగా ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన సహచర కుటుంబాలను ఆదుకునేందుకు ఆశన్న (Ashanna) ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన బృందం అమరుల కుటుంబ సభ్యులను కలిసారు. ఈ సందర్బంగా బాధితులు తమ వాళ్లను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన మాజీలు సాధ్యమైనంత మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం వాళ్లతో కలిసి భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Also: ఏమన్నా స్పందించను: వేం నరేందర్ రెడ్డి
Follow Us On: Instagram

