అప్పుడు బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌.. సహకార పదవుల కోసం నేతల ప్లాన్!

కలం, నిర్మల్‌ : అధికార పార్టీ మారింది.. రాజకీయ రంగులు మారాయి.. కానీ సహకార సంఘాల పదవుల (Cooperative Society Posts) పై కొందరి పట్టు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో పీఏసీఎస్‌, ఎఫ్‌ఏసీఎస్‌, డీసీఎంఎస్‌, డీసీసీబీ వంటి సహకార సంస్థల్లో పదవులు అనుభవించిన కొందరు నేతలు.. రాష్ట్రంలో అధికార మార్పు అనంతరం కాంగ్రెస్‌ గూటికి చేరి మళ్లీ అదే పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్‌, ఎఫ్‌ఏసీఎస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులను నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేసే అంశంపై కసరత్తు చేస్తుండటంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా కేంద్రం, గాంధీభవన్‌ వరకు పలువురు నేతలు తమకు అనుకూలంగా పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికారం మారినా.. పదవుల కోసం అదే ముఖాలు?

సహకార సంఘాల పదవులు గ్రామీణ రాజకీయాల్లో కీలకంగా ఉంటాయి. రైతులు, వ్యవసాయం, రుణాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలతో నేరుగా సంబంధం ఉండటంతో వీటి పాలకవర్గాల్లో చోటు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుంది. నిర్మల్‌ జిల్లాలో 17 పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఏసీఎస్‌ సొసైటీ ఉంది. పాలకవర్గాల్లో అత్యధికంగా బీఆర్‌ఎస్‌ అనుబంధ నాయకులు ప్రాతినిధ్యం వహించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ సమీకరణాలు మారాయి. నేతలు కాంగ్రెస్‌ లో చేరిపోయారు.

పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, డీసీసీబీ తదితర సహకార సంస్థల పాలకవర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అనంతరం గడువు పొడిగింపులు, పాలకవర్గాల కొనసాగింపు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్‌ ఇంచార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిపై హైకోర్టును ఆశ్రయించడంతో పాత పాలకవర్గాల కొనసాగుతున్నాయి. ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశం తెరపైకి రావడంతో సహకార సంఘాల రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.

ఇదే అంశం కాంగ్రెస్‌ లో అంతర్గత అసంతృప్తికి కారణమవుతోంది. అధికారంలో లేని సమయంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలను పక్కనపెట్టి, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తే కష్టకాలంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక పార్టీ నాయకత్వం నుంచి అభిప్రాయాలు తీసుకొని నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన సీనియర్లకు అవకాశం కల్పిస్తుందా లేదా గతంలో పదవులు అనుభవించిన వారికే మరోసారి అవకాశం ఇస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>