కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Red Cross Society) నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను(Rajarshi Shah) కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులు, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు సహాయ చర్యలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించి పేదలు, నిరుపేదలు, బాధితులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని సూచించారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. సమాజ హితం కోసం నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రతినిధులు ఆడే క్రాంతి కుమార్, మనోహర్, సభ్యులు పాల్గొన్నారు.

