కలం, కరీంనగర్: దేశానికి సమర్థవంతమైన నాయకులను ప్రధాన మంత్రులుగా అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రులంతా సమర్థవంతమైన పాలన అందించారని కొనియాడారు. ఇందిరాగాంధీ రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కీలక సంస్కరణలు చేపట్టి పేదల పక్షాన నిలిచారని అన్నారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేశారని, పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడంతో పాటు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ వంటి పలు కీలక కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
రూ.25.49 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 41 మందికి కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు మరో 12 మందికి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 65 మంది లబ్ధిదారులకు రూ.25.49 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పేద కుటుంబాలకు కొంతమేరకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు.
గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం లబ్ధిదారులు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్కులను త్వరితగతిన మంజూరు చేసి అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, బెజ్జంకి ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్, పార్టీ జిల్లా కార్యదర్శి అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

