దిగ్గజాల సమరం.. హైదరాబాద్‌లో టెన్నిస్ ప్రీమియర్ లీగ్!

కలం, వెబ్ డెస్క్ : టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (Tennis Premier League) 8వ సీజన్ వేదికగా హైదరాబాద్ ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ డిసెంబర్ 8 నుంచి 13 వరకు నగరంలోని ప్రసిద్ధ ఎల్‌బీ స్టేడియంలో జరగనుంది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సహకారంతో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లీగ్ విస్తరణలో భాగంగా ఏడు విజయవంతమైన సీజన్ల అనంతరం టోర్నీని భాగ్యనగరానికి తరలించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు లీగ్ ప్రత్యేకమైన 25 పాయింట్ల ఫార్మాట్‌లో తలపడనున్నాయి. జీఎస్ ఢిల్లీ ఏసెస్, హైదరాబాద్ స్ట్రైకర్స్, లక్నో బ్లేజర్స్, గుర్గావ్ గ్రాండ్ స్లామర్స్, గుజరాత్ పాంథర్స్, రాజస్థాన్ రేంజర్స్, కోల్‌కతా థండర్ బ్లేడ్స్, ముంబై రాయల్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో అంతర్జాతీయ దిగ్గజ ఆటగాళ్లతో పాటు భారత్‌కు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్లు సందడి చేయనున్నారు. ఈ మ్యాచ్‌లను అభిమానుల కోసం జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

భారత టెన్నిస్ లెజెండ్లు లియాండర్ పేస్, సానియా మీర్జాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, వివిధ జట్ల సహ యజమానులైన రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి బేంద్రే బహల్ ఈ టోర్నీ(Tennis Premier League)కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ లీగ్‌కు కియా ఇండియా ఎక్స్‌క్లూజివ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా 400కు పైగా అనుబంధ టెన్నిస్ అకాడమీలను అనుసంధానిస్తూ క్రీడల అభివృద్ధికి టీపీఎల్ యాప్ వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ క్రీడా సంస్కృతి, ఇక్కడి అభిమానుల ఆదరణ టీపీఎల్ 8వ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా మారుస్తాయని లీగ్ సహ వ్యవస్థాపకులు కునాల్ ఠక్కూర్, మృణాల్ జైన్ ధీమా వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ టోర్నీ సరైన ఉదాహరణగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

Also Read : ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>