కలం, దేవరకొండ: దేవరకొండ (Devarakonda) పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భోజనశాలను (New Dining Hall) శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. ఆలయంలో భోజనశాల ఏర్పాటు చేయడం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొంటూ.. అయ్యప్ప స్వామివారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆలయ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

