కలం, నల్లగొండ బ్యూరో: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశను ఎరగా చూపి అమాయక ప్రజలను నకిలీ కరెన్సీ నోట్లతో ముంచుతున్న ఓ విదేశీ నిందితుడిని (Foreign National Arrested) తిప్పర్తి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశానికి చెందిన గోయిటా సౌంగలో అనే వ్యక్తి రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చి హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో నివసిస్తున్నాడు. వ్యవసాయం వృత్తిగా చెప్పుకునే ఇతని వీసా గడువు ఆగస్టు 2024తో ముగిసింది. అప్పటి నుండి అక్రమంగా నివసిస్తూ.. సల్మాన్ అలియాస్ ఉమా దాలియా అనే మరో వ్యక్తితో కలిసి ఈ నకిలీ కరెన్సీ మోసాలకు (Fake Currency Scam) తెరలేపాడు. వీరిద్దరూ వాట్సాప్ ద్వారా అమాయకులను సంప్రదించి, తమ వద్ద ప్రత్యేక టెక్నాలజీ ఉందని, రూ.లక్ష అసలు కరెన్సీ ఇస్తే రూ.5 లక్షల విలువైన రూ.500 నోట్లను ఇస్తామని నమ్మిస్తారు. బాధితులకు నమ్మకం కలిగించడానికి నల్లటి రంగు పూసిన కాగితాలపై ఒక రసాయనాన్ని పోసి, వాటిని అసలు నోట్లుగా మార్చినట్లు ‘డెమో’ చూపిస్తారు.
నిజానికి అవి రంగు పూసిన అసలు నోట్లు మాత్రమే. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన తిప్పర్తి మండలం మల్లేపల్లి వారిగూడెంకు చెందిన వంగూరి జానయ్య అనే వ్యక్తిని నిందితుడు సంప్రదించాడు. లక్ష రూపాయలు తీసుకుని 5 లక్షల విలువైన నోట్ల కట్ట అని చెప్పి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. పైన నాలుగు అసలు నోట్లు ఉంచి, లోపల నల్లటి కాగితాలు పెట్టి మోసం చేశాడు. బాధితుడు ఇంటికి వెళ్లి రసాయనంతో కడిగినా అవి మారకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో జానయ్య, తన స్నేహితుడు అభిరామ్ సాయంతో నిందితుడికి ఫోన్ చేసి తనకు మరిన్ని నోట్లు కావాలని ఆశ చూపాడు. రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి నమ్మించి గురువారం మధ్యాహ్నం తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు రప్పించాడు. నిందితుడు రాగానే బాధితులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నిందితుల నుంచి నాలుగు కట్టల నల్లటి కాగితాలు, ఒక రసాయన ద్రావణం, పౌడర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సౌంగలో గతంలోనూ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి మోసాలకు పాల్పడి, రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఇస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని, నకిలీ కరెన్సీ చలామణి (Fake Currency Scam) చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ శంకర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Read Also: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగడ్తల వర్షం
Follow Us On: X(Twitter)

