కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు (Food Safety Inspections) నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ తనిఖీల్లో జిల్లా ఆహార భద్రతా అధికారి ఇ. శరత్ ఆహార విక్రయ, నిల్వ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఆహార పదార్థాల నాణ్యత, తయారీ విధానం, నిల్వ పద్ధతులతో పాటు వంటగది, పరిసరాల పరిశుభ్రతను అధికారి తనిఖీ చేశారు. ఆహార నిల్వకు ఉపయోగిస్తున్న కంటైనర్ల నాణ్యతను, సంస్థల FSSAI లైసెన్సులు, ఇతర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆహార వ్యాపార నిర్వాహకులకు అధికారి ఇ. శరత్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. నాణ్యత లేని లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించరాదని ఆదేశించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతా చట్టం, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ప్రజలు తాము కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
Also Read : అజిత్ దోవల్‌కు సమన్లు.. భారత్ షాకింగ్ రిప్లై!
Follow Us On : WhatsApp

