కలం, నిర్మల్ : ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు (Nirmal RTC Bus) ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో అందులోని వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్ బస్టాండ్ నుంచి అప్పారావుపేట్ కు బస్సు బయలుదేరింది. బస్సులో సుమారు 60 మందికి మించి ప్రయాణికులు ఉండటంతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు మినీ ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ చౌక్‌కు చేరుకోగానే ఒక్కసారిగా ఎడమవైపునకు ఒరిగిపోయింది.
అయితే పరిస్థితిని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును సిగ్నల్ వద్ద నిలిపివేశాడు. ప్రయాణికులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడం, భద్రతా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించే రవాణా శాఖ అధికారులు.. ఆర్టీసీ బస్సుల్లో ఇంతటి రద్దీ కనిపిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

