కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ (Sujathanagar)లోని పలు హోటళ్లు, స్వీట్ల తయారీ, విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రత అధికారి శరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని సంస్థలు ఆహార భద్రతా సంస్థల రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండానే నడుస్తున్నట్లు గుర్తించారు.
పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు మూడు లీగల్, సర్వైలెన్స్ నమూనాల చొప్పున సేకరించి రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపారు. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటించని రెండు వ్యాపార సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి శరత్ మాట్లాడుతూ.. ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

