కలం, నిర్మల్ : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈనెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన (Rythu Garjana) మహాసభ పోస్టర్లను శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడింది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరవు అని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని ఎత్తిపోసి రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేయడం లేదని విమర్శించారు.
ప్రతిరోజూ సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, అదే నీటిని సాగు అవసరాలకు వినియోగిస్తే అనేక ప్రాంతాల్లో పంటలను కాపాడే అవకాశం ఉండేదన్నారు. నీటి కొరతతో పంటలు ఎండిపోతూ రైతులు ఆందోళన చెందుతున్నా, అందుబాటులో ఉన్న నీటిని వినియోగించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మేడిగడ్డ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ మినీ స్టేడియం పరిశీలన..
ఈనెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రైతు గర్జన మహాసభ ఏర్పాట్లను వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. పార్కింగ్ స్థలాలు, ఇతర సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిలు రాంకిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, ముథోల్ నియోజకవర్గ సమన్వయకర్త రమాదేవి, పట్టణ అధ్యక్షుడు మారగొండ రాము, నాయకులు నల్ల వినయ్ రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

