కలం డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL Auction 2026) కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, సుదీర్ఘ పరిశీలనల తర్వాత బీసీసీఐ తుది జాబితాను 350 మందికి కుదించింది. వీరిలో 224 మంది భారత అనామక క్రికెటర్లు.. అంటే ఇంకా ఐపీఎల్‌ను రుచి చూడని ప్రతిభావంతులు. ఈ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇప్పటికే దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పలు ఫ్రాంచైజీలు స్కౌటింగ్ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు మంది భారత యువ ఆటగాళ్లు ఈసారి మినీ వేలం (IPL Auction 2026) స్టార్‌లు కావచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారి ఫామ్, రికార్డులు, మ్యాచ్ ఇంపాక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది.
1. అకిబ్ నబీ ధర్ (జమ్మూ & కశ్మీర్)
29 ఏళ్ల పేసర్ అకిబ్ నబీ ధర్ ఈ వేలంలో అత్యధిక ఫైట్ ఉండే ఆటగాడిగా భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7.41 ఎకానమీతో 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కొత్త బంతితో స్వింగ్ బౌలింగ్ అతని ప్రధాన బలం. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు అతని స్థిరత్వానికి నిదర్శనం.
2. కార్తీక్ శర్మ (రాజస్థాన్)
19 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మపై (Kartik Sharma) ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ దృష్టి పడింది. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 133 పరుగులు, స్ట్రైక్‌రేట్ 160+. ఫినిషర్‌గా భారీ షాట్లు కొట్టగలిగే సామర్థ్యం అతన్ని వేలంలో ప్రత్యేకంగా నిలబెట్టే అంశం.
3. తుషార్ రహేజా (తమిళనాడు)
తమిళనాడు ఓపెనర్ తుషార్ రహేజా ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌లో 151 పరుగులు, స్ట్రైక్‌రేట్ 164. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అయితే 185 స్ట్రైక్‌రేట్‌తో టాప్ స్కోరర్! వికెట్ కీపింగ్ అతనికి అదనపు బలం.
4. అన్‌మోల్ ప్రీత్ సింగ్ (పంజాబ్)
అనుభవం, స్థిరత్వం, అగ్రెసివ్ బ్యాటింగ్. ఈ మూడు కలిసి అన్‌మోల్ ప్రీత్ సింగ్‌ను (Anmolpreet Singh) వేలంలో హాట్ కేక్‌గా మార్చాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 241 పరుగులు, స్ట్రైక్‌రేట్ 172. ఇప్పటికే దేశవాళీ వేదికపై పంజాబ్‌కు ప్రధాన ఆటగాడిగా నిలుస్తున్నాడు.
5. అశోక్ శర్మ (రాజస్థాన్)
ఈ 23 ఏళ్ల వేగవంతమైన పేసర్ 140 కిమీ వేగంతో నిలకడగా బంతులు వేయగలడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి సీజన్ బౌలర్‌గానే నిలుచున్నాడు. ఫ్రాంచైజీలు యంగ్ ఫాస్ట్ బౌలర్లపై చూపించే ఆసక్తి కారణంగా అశోక్ వేలంలో అధిక ధర పలికే అవకాశం ఖాయం.
Read Also: పాడైన గోధుమలు పంపారు.. నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం..
Follow Us On : Youtube


