సారపాక ఐటీసీ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురికి గాయాలు!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జామాయిల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ​సిద్దిపేట జిల్లాకు చెందిన ఐదుగురు హనుమాన్ భక్తులు భద్రాచలంలోని రామయ్యను దర్శించుకుని కారులో తిరిగి ప్రయాణమయ్యారు. కారు సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపానికి చేరుకోగానే, జామాయిల్ కర్రల లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకునే క్రమంలో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

​ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ రెడ్డి పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ​ప్రమాదానికి కారణమైన జామాయిల్ పుల్లల ట్రాక్టర్‌ను బూర్గంపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అనాలోచితంగా మలుపు తిరగడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>