కలం, కరీంనగర్ బ్యూరో : జాతీయ అగ్నిమాపక వారోత్సవాల (National Fire Service Week) సందర్భంగా కరీంనగర్ (Karimnagar) నగరంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈనెల 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది, 11 అగ్నిమాపక వాహనాలతో సుమారు పది కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అగ్నిమాపక శాఖ తరఫున మాక్ డ్రిల్స్, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా చర్యలపై వివరణ ఇస్తున్నామని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ర్యాలీ సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన సూచనలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు రాజకుమార్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

