కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోపలి భాగం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సర్వీస్ వైర్లలో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ ప్రమాద స్థలానికి సరిగ్గా ఆనుకుని ప్రసిద్ధ ఎస్పిటి మార్కెట్ బట్టల దుకాణాలు ఉన్నాయి. మంటలు గనుక ఆ మార్కెట్‌కు వ్యాపిస్తే భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉండటంతో, వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాద తీవ్రతను గమనించి ఫైర్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని, మంటలను అదుపు చేసి పెద్ద ముప్పు తప్పించాలని స్థానికులు, వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

