సన్నొడ్లకు ఫుల్ డిమాండ్.. నల్లగొండలో రికార్డు ధర!

కలం, నల్లగొండ బ్యూరో: సన్న వడ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. క్వింటాల్‌ రేటు రూ.4 వేలకు చేరింది. ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో వర్షాల్లేకపోవడం.. వరి సాగు తగ్గడం.. సాగు నీరు సమృద్ధిగా లభించకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. కరెంట్ కోతలు.. ఇలా వీటన్నింటి కారణంగా దిగుబడి సగానికి సగం పడిపోయింది.

దీంతో సన్నాలకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. నల్లగొండ జిల్లాలో రైతులు కోతలు మొదలుపెట్టగా.. వడ్ల కోసం వ్యాపారులకు పొలాల వద్దకే పరుగెత్తుకొని వస్తున్నారు. క్వింటాల్‌కు రూ.4 వేల చొప్పున చెల్లిస్తూ నెట్ క్యాష్ చేతిలో పెడుతున్నారు. రానున్న రోజుల్లో సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాతో మిల్లర్లు ముందుగానే రైతుల నుంచి వడ్లు సేకరిస్తున్నారు.

నో కటింగ్స్

ఈసారి ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో నీటి ఎద్దడి కారణంగా నల్లగొండ జిల్లాలో వరి సాగు (Nalgonda Paddy) గణనీయంగా తగ్గింది. అందులోనూ తక్కువ విస్తీర్ణంలోనే సన్న రకాలను రైతులు సాగు చేశారు. వాతావరణ మార్పులతో పంట పొట్ట దశలోనే దెబ్బతినడంతో దిగుబడి సగానికి సగం పడిపోయింది. దీంతో సన్న బియ్యానికి కొరత ఏర్పడుతుందన్న సంకేతాలతో మిల్లర్లు అలర్ట్ అయ్యారు.

నల్లగొండ, మిర్యాలగూడ పరిధిలో ఇప్పటికే కోతలు ప్రారంభం కావడంతో కొనుగోళ్ల కోసం పొలాల వద్దకే వస్తున్నారు. రైతులు అమ్మేందుకు కొంచెం వెనుకా ముందు ఆడినా.. నెట్ క్యాష్ చేతిలో పెట్టి వడ్లు తీసుకెళ్తున్నారు. తప్ప, తాలు, తేమ, తరుగు, కటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కూడా మిల్లర్లకు వడ్లు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ధర పెరిగినప్పటికీ, దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోటీపడి కొనుగోళ్లు

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రైస్ మిల్లులు అత్యధికంగా ఉండటంతో మిల్లర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఏజెంట్లను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం నుంచి మాడ్గులపల్లి, వేములపల్లి మీదుగా మిర్యాలగూడ వరకు విస్తరించిన అద్దంకి- నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి వెంట ధాన్యం ట్రాక్టర్ల కోసం ఏజెంట్లు పడిగాపులు కాస్తున్నారు. ట్రాక్టర్ కనిపిస్తే చాలు.. రైతులను చుట్టుముట్టి అడ్వాన్స్ డబ్బులు చేతిలో పెట్టి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

గతానికి భిన్నం

గతంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులే మిల్లర్ల కాళ్లావేళ్లా పడాల్సి వచ్చేది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో రోజుల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీనికి తప్ప, తాలు, తేమ, తరుగు పేరుతో కటింగ్స్ ఉండేవి. రైతులకు డబ్బులు సైతం నెల రోజుల తర్వాతే వచ్చేవి. గతంలో క్వింటాల్ సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 మించి దక్కేది కాదు. ప్రైవేట్ మిల్లర్లయితే రూ.2,200 కంటే పైసా ఎక్కువ ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిల్లర్లే నేరుగా పొలాల దగ్గరికి వచ్చి.. ఎలాంటి కటింగ్స్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.4 వేల చొప్పున వెంటనే రైతులకు చెల్లిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>