కలం, స్పోర్ట్స్ : క్రికెట్‌లో బంతి రంగు మరోసారి మార్పు బాట పట్టింది. రెడ్ బాల్ నుంచి వైట్ బాల్‌కు.. అక్కడి నుంచి పింక్ బాల్‌కు (Pink Ball) వచ్చిన ఆట ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. డే టెస్టుల్లోనూ పింక్ బాల్ వాడేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది. అయితే ఒక కీలక నిబంధన మాత్రం పెట్టింది. మ్యాచ్ మొదలైన తర్వాత బంతి రంగు మార్చడానికి వీల్లేకపోవడమే ఆ నిబంధన.
రెడ్ బాల్‌తో మొదలైన ప్రయాణం
క్రికెట్‌లో చాలా కాలం రెడ్ బాల్‌దే రాజ్యం. టెస్టు క్రికెట్‌లో ఇప్పటికీ అదే సంప్రదాయ బంతి. అయితే ఆట మారింది. మ్యాచ్‌ల సమయం మారింది. అవసరాలు మారాయి. దాంతో బంతి రంగులోనూ మార్పులు వచ్చాయి. వన్డే క్రికెట్‌కు వైట్ బాల్ వచ్చింది. ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల కింద ఆడే మ్యాచ్‌ల్లో స్పష్టంగా కనిపించేందుకు ఇది ఉపయోగపడింది. ఆ తర్వాత వైట్ బాల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సాధారణంగా మారిపోయింది.
పింక్ బాల్ ఎందుకు?
టెస్టు క్రికెట్‌ను రాత్రివేళకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరో సమస్య ఎదురైంది. రెడ్ బాల్‌తో ఫ్లడ్‌లైట్ల కింద ఆట కొనసాగించడం అంత సులువు కాదు. దానికి పరిష్కారంగా పింక్ బాల్ వచ్చింది. డే-నైట్ టెస్టుల్లో ఇది ఉపయోగపడేలా రూపొందించారు. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్ తొలి డే-నైట్ టెస్టుగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగించారు. అప్పటి నుంచి డే-నైట్ టెస్టుల్లో పింక్ బాల్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
ఇప్పుడు డే టెస్టుల్లోనూ పింక్
ఇక కొత్త ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్‌తో పింక్ బాల్‌కు మరో అవకాశం వచ్చింది. డే-టైమ్ టెస్టుల్లోనూ పింక్ బాల్‌ను ఉపయోగించవచ్చు. దీని వెనుక ప్రధాన కారణం బ్యాడ్ లైట్. టెస్టు మ్యాచ్ చివరి సెషన్‌లో వెలుతురు తగ్గితే ఆట ఆగిపోయే పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి సమయంలో పింక్ బాల్‌తో ఆటను కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి డే టెస్టులో పింక్ బాల్ ఉండదు. ఇది తప్పనిసరి కాదు. రెండు జట్లు అంగీకరిస్తేనే పింక్ బాల్‌తో ఆడొచ్చు.
మ్యాచ్ మధ్యలో మాత్రం రంగు మారదు
ఇక్కడే కొత్త నిబంధనలో కీలక అంశం ఉంది. రెడ్ బాల్‌తో మ్యాచ్ మొదలైన తర్వాత మధ్యలో బాల్ మర్చడం కుదరదు. కాబట్టి పింక్ బాల్‌తో ఆడాలా? రెడ్ బాల్‌తో ఆడాలా? అనే నిర్ణయం మ్యాచ్ ప్రారంభానికి ముందే తీసుకోవాలి. రెండు జట్లు అంగీకరించిన తర్వాతే పింక్ బాల్‌తో మ్యాచ్ మొదలవుతుంది. ఒకసారి మ్యాచ్ మొదలైతే అదే బంతితో కొనసాగాలి. అంటే పరిస్థితిని బట్టి మధ్యలో బంతి రంగు మార్చే విధానం మాత్రం ఉండదు.
‘చట్టం’ కాదు.. కండిషన్
పింక్ బాల్‌కు సంబంధించిన ఈ మార్పు క్రికెట్ చట్టంలో కొత్త నిబంధనగా చూడకూడదు. ఇది ఐసీసీ ప్లేయింగ్ కండిషన్‌లో చేసిన మార్పు. అందుకే ప్రతి సిరీస్‌లోనూ ఇది ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదు. ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు జట్లు ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. పింక్ బాల్‌తో ఆడితే బ్యాడ్ లైట్ కారణంగా వృథా అయ్యే ఆట సమయాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఆట అవసరమే మార్పుకు కారణం
రెడ్ బాల్ నుంచి వైట్ బాల్‌కు మార్పు పరిమిత ఓవర్ల క్రికెట్ అవసరంతో వచ్చింది. పింక్ బాల్ డే-నైట్ టెస్టుల అవసరం నుంచి వచ్చింది. ఇప్పుడు అదే పింక్ బాల్‌ను డే టెస్టుల్లోనూ ఉపయోగించే అవకాశం వచ్చింది. అంటే బంతి రంగు మారడం వెనుక ప్రతిసారీ ఆట అవసరమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే పింక్ బాల్ ఇప్పటికీ రెడ్ బాల్‌ను పూర్తిగా భర్తీ చేయడం లేదు. రెండు జట్లు అంగీకరిస్తేనే డే టెస్టుల్లో ఈ ప్రయోగం జరుగుతుంది.
బంతితో పాటు సమయంపైనా నజర్
కొత్త ప్లేయింగ్ కండిషన్స్‌లో బంతి రంగుతో పాటు టైమ్ వేస్టింగ్‌పైనా ఐసీసీ దృష్టి పెట్టింది. ఆటను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే అంపైర్లు ముందుగా హెచ్చరిస్తారు. పరిస్థితి కొనసాగితే ఐదు పెనాల్టీ పరుగులు విధించే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ జట్టు అయినా.. ఫీల్డింగ్ జట్టు అయినా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆట వేగం తగ్గకుండా చూడటమే దీని ఉద్దేశం. రెడ్ నుంచి వైట్.. వైట్ నుంచి పింక్. క్రికెట్ మారుతున్న కొద్దీ బంతి కూడా మారుతోంది. ఇప్పుడు డే టెస్టుల్లో పింక్ బాల్‌కు వచ్చిన ఈ కొత్త అవకాశం ఎంతవరకు ఉపయోగపడుతుందో రాబోయే మ్యాచ్‌ల్లో తేలనుంది.

