కలం, నిర్మల్: తెలంగాణ ఆర్టీసీలో పదేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad RTC Elections) రీజియన్ పరిధిలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, ఆసిఫాబాద్ డిపోల్లో పోలింగ్ ప్రారంభమైంది.
ఆయా డిపోల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రీజియన్ పరిధిలో మొత్తం 1,773 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో నిర్మల్ డిపోలో 385, భైంసాలో 193, ఆదిలాబాద్ 398, మంచిర్యాల 403, ఉట్నూర్ 111, ఆసిఫాబాద్ 251 మంది, రీజినల్ మేనేజర్ కార్యాలయంలో 32 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రతి ఉద్యోగి బ్యాలెట్ పద్ధతిలో రెండు ఓట్లు వేయనున్నారు. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ఎంపికకు, మరొకటి స్థానిక గుర్తింపు సంఘం ఎంపికకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పదేళ్ల తర్వాత యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

