కుమార్తెలను చెరువులో తోసి.. కన్నతండ్రి కిరాతకం!

కలం, వెబ్​ డెస్క్​ : కామారెడ్డి (Kamareddy) పట్టణంలో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, ముగ్గురు కుమార్తెలను చెరువులోకి తోసేసి చంపేశాడు. ఆర్పీ నగర్ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీపత్ (8), ఆయత్ (7), మరియం (5) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ, షబీనా కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. శనివారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన షబీనాకు పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తొలుత పోలీసుల విచారణలో ఇస్మాయిల్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పిల్లలకు దోశ తినిపించడానికి తీసుకువెళ్లానని, ఆ తర్వాత గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్ళిపోయానని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఇస్మాయిల్ చెబుతున్న మాటలకు ఆధారాలకు అసలు సంబంధం లేదని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముగ్గురు పిల్లలను పోషించే స్తోమత లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అతడు అంగీకరించాడు.

నిందితుడు తన ముగ్గురు కుమార్తెలను స్థానిక పెద్దచెరువు వద్దకు తీసుకువెళ్లి, వారిని నీటిలోకి తోసేశాడు. వారంతా చనిపోయారని నిర్ధారించుకునే వరకు సుమారు అరగంట పాటు అక్కడే వేచి ఉన్నట్లు విచారణలో వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక బృందాలతో కలిసి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవగా, మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

Read Also: ‘నారీ శక్తి’.. అయినా ఆగని వివక్ష

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>