దామరచర్లలో విషాదం.. టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

కలం, చంద్రుగొండ :  “అక్కడ ఒక్క లైటు ఉండి ఉంటే.. ఆ వెలుతురులో టిప్పర్ వచ్చేది కనిపించి ఆ యువకుడు బతికేవాడు!” – నేషనల్ హైవే అధికారుల ఐదేళ్ల నిర్లక్ష్యంపై దామరచర్ల (Damaracherla) గ్రామస్తులు ఆవేదనతో విసిరిన ప్రశ్న ఇది. అధికారులు కాలయాపన చేస్తూ వదిలేసిన చీకటి మూలమలుపే ఒక యువకుడి జీవితాన్ని బలితీసుకుంది. లైట్లు వెలగకపోవడంతో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని 27 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన తీవ్ర విషాదకర సంఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పరిధిలో చోటుచేసుకుంది.

చంద్రుగొండ మండలం దామరచర్ల మూలమలుపు వద్ద ఉన్న సెంట్రల్ లైటింగ్ గత కొన్ని ఏళ్లుగా అలంకారప్రాయంగా మారి, అంధకారంలోనే ఉంది. రాత్రి వేళల్లో చంద్రుగొండకు చెందిన సాయి నిఖిల్ (27) అనే యువకుడు ఈ మార్గంలో వెళ్తుండగా, మూలమలుపు వద్ద తీవ్రమైన చీకటిగా ఉండటంతో వేగంగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని గుర్తించలేకపోయాడు. బలంగా ఢీకొట్టిన ఈ ప్రమాదంలో సాయి నిఖిల్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఒకవైపు కంటిముందే యువకుడి మృతదేహం, మరోవైపు అధికారుల బాధ్యతారాహిత్యంపై ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, గ్రామస్తులు వెంటనే రోడ్డుపై బైఠాయించారు. దామరచర్ల మూలమలుపు వద్ద రాస్తారోకో నిర్వహించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నిసార్లు విన్నవించినా సెంట్రల్ లైటింగ్‌ను బాగు చేయలేదని, ఈ ప్రమాదానికి నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే ప్రత్యక్ష కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చి లైటింగ్‌ను పునరుద్ధరించాలని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>