కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ (Valigonda) మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామంలో బుధవారం ఉదయం రైతులు మెరుపు ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆందోళన చెందిన రైతులు, అకస్మాత్తుగా భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావస్తుందని నేటికీ ధాన్యం కొనుగోలు సగం కూడా పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ దశరథ, ఎస్ఐ యుగంధర్ గౌడ్ రాస్తారోకో వద్దకు చేరుకొని రైతులకు అవసరమైన లారీలను పంపించి కొనుగోళ్లను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రాస్తారోకోతో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

