కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలలో ఆరుబయట నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త (Khushboo Gupta) అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పరిస్థితులను సమీక్షించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలుస్తోందని, తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
భూత్పూర్ (Bhoothpur) మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన రైతు కె. శ్రీనివాసులు నిల్వ చేసిన వరి ధాన్యం భారీ వర్షాల కారణంగా పూర్తిగా తడిసిపోయింది. రైతు ఇబ్బందులను గుర్తించిన జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం హస్నాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రవి నాయక్, అధికారులు, సుమారు 150 నుంచి 200 వరి బస్తాలు నీటిలో తడిసిపోయినట్లు గుర్తించారు. రైతుకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాటికొండలోని నరహరి పారా బాయిల్డ్ రైస్ మిల్ యాజమాన్యంతో చర్చించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా సమన్వయం చేశారు.
గురువారం జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్‌తో కలిసి అధికారులు మరోసారి హస్నాపూర్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తడిసిన ధాన్యాన్ని బస్తాలలో నింపి తూకం వేసి, ట్రాక్టర్ల ద్వారా మొత్తం 156 బస్తాలను సమీపంలోని బాయిల్డ్ రైస్ మిల్‌కు తరలించారు. అనంతరం మిల్లర్‌కు వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అలాగే, రైతుకు కనీస మద్దతు ధర (MSP) చెల్లింపులు త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్‌కు సూచించారు.
ఈ సందర్భంగా రైతు కె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. “తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పడమే కాకుండా ఆచరణలో చూపించింది. నా వంటి రైతులకు ప్రభుత్వం నిజమైన అండగా నిలుస్తోంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం
Follow Us On: Sharechat

