కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్(Karimnagar) వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోళ్లలో(Maize Procurement) జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ మార్కెట్ యార్డ్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆలస్యం కావడమే కాకుండా, దాని భారాన్ని కూడా తమపైనే వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మొక్కజొన్న తూకం వేసే వరకు మాత్రమే రైతుల బాధ్యత ఉండాలి. కానీ గన్నీ బ్యాగులు, సుతిల్ తాడు సమకూర్చడం, మొక్కజొన్న ఎత్తడం వంటి పనులను కూడా రైతుల చేతనే చేయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అదనపు ఖర్చులు తమపై పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్తాల తూకంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి 50 కిలోల బస్తాకు 600 నుండి 700 గ్రాములు అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. అంతకంటే ఎక్కువ తూకం వేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డ్‌లో సీసీ కెమెరాలు, లైట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని.. ప్రశ్నిద్దామంటే, మార్క్‌ఫెడ్ అధికారులు అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు కేవలం 30 శాతం కొనుగోళ్లు మాత్రమే జరిగాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

