ఖమ్మం జిల్లాలో అన్నదాతకు అమ్మకం కష్టాలు

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో రైతులు పంట పండించిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏనుకూరు (Enkoor) మండలంలో సీడ్ మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సీడ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు, కంకులను విరిచి ఎండబెట్టి కంపెనీలు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచారు. అయితే కంపెనీలు సమయానికి లారీలు పంపించకపోవడంతో పంట వారం రోజులుగా కాటాల వద్దే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొంతమంది రైతులు.. కంపెనీలు గన్ని సంచులు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పంట పొలాల్లోనే ఉండిపోగా, ఎండ, వాన ప్రభావంతో నాణ్యత తగ్గిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పంట నాణ్యత తగ్గితే తూకం కూడా తగ్గి భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా చూడాలని మొక్కజొన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో ఖమ్మం (Khammam) పట్టణంలోని మిర్చి మార్కెట్‌లో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారస్తులు, దళారుల చేతిలో మోసపోతున్నామని వారు వాపోతున్నారు. మార్కెట్‌లో ప్రకటించిన జెండా ధర కంటే దాదాపు రూ.3 వేలు తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారుల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని, రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు విక్రయించేలా సదుపాయాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Read Also: ఎయిడ్స్‌పై అవగాహన.. కేబుల్ బ్రిడ్జ్‌పై మంత్రి దామోదర మానవహారం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>