Mobile Popup Ad
Mobile Popup Ad

ఎయిడ్స్‌పై అవగాహన.. కేబుల్ బ్రిడ్జ్‌పై మంత్రి దామోదర మానవహారం

కలం, వెబ్ డెస్క్: హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం‌ సరికాదని.. వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsimha) అభిప్రాయపడ్డారు.హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన (HIV AIDS awareness) కల్పిస్తూ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్‌పై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన‌ మానవహారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని.. చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతుందని అన్నారు. రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి‌ తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని తెలిపారు.

ఇలా చేస్తే హెచ్‌ఐవీ వ్యాపించదు..

షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని మంత్రి (Minister Rajanarsimha) స్పష్టం చేశారు. అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని.. అవగాహనే దీనికి సమాధానమని చెప్పారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం‌ సరికాదని.. వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని చెప్పారు.హెచ్‌ఐవీ & ఎయిడ్స్ (నివారణ మరియు నియంత్రణ) చట్టం 2017 ప్రకారం వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి.. కానీ, ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదని అన్నారు. సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని తెలిపారు.

ఉచితంగా టెస్టులు, చికిత్స, మెడిసిన్ అందిస్తున్నాం..

హెచ్ఐవీ/ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మెడిసిన్ అందిస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా యువతకు సూచన చేస్తూ అనారోగ్యకర అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోకండని చెప్పారు. ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే అని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని.. అది చాలా ప్రమాదకరమని చెప్పారు. మరీ ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని.. ఆరోగ్యవంతమైన కుటుంబాలతో ఆరోగ్యవంతమైన సమాజం, బలమైన రాష్ట్రం నిర్మితమవుతాయని చెప్పారు.

Read Also: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు : ఎమ్మెల్సీ రవీందర్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>