ఉమ్మడి నల్లగొండలో అన్నదాతల అరిగోస

కలం, నల్లగొండ బ్యూరో : చెమటోడ్చి పసిడి పంట పండించిన రైతు.. ఇప్పుడు రోడ్లపైనే ధాన్యం కాపలా కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న దుస్థితి అన్నదాతను తీవ్రంగా కలచివేస్తోంది. వరి కోతలు పూర్తవుతున్న వేళ రైతు ముఖంలో ఆనందం కనిపించాల్సిన చోట ఆందోళన నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకునేందుకు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా సర్వీస్ రోడ్లు, హైవేలే ధాన్యం కేంద్రాలుగా మారిపోయాయి.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి–అద్దంకి, మల్లంపల్లి–మాచర్ల రహదారుల వెంట కిలోమీటర్ల మేర ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ప్రమాదాలు చోటుచేసుకున్నా.. అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం కాగితాలపై 800కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. సగానికి పైగా కేంద్రాలు మాత్రమే ప్రారంభమవగా, దాదాపు 200 కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట్ల కూడా ప్యాడీ క్లీనర్లు లేకపోవడం, తేమ శాతం పేరుతో ఆలస్యం చేయడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోంది.

ధాన్యం ఆరబెట్టుకునేందుకు సరైన స్థలం లేక చెరువులు, కుంటలు, బీడు భూములు, ఖాళీ ప్రదేశాలు కేంద్రాలుగా మారాయి. రాత్రిళ్లు ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి కాపలా కాస్తూ, పగటిపూట ఎండబెట్టే పనిలో రైతులు నిమగ్నమవుతున్నారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో 13.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, సుమారు 32.92 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేశారు. ఇందులో 17.29 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకు కొనుగోళ్లు మందగించాయి. ఇప్పటికే కేంద్రాల్లో 8 లక్షల టన్నులకు పైగా ధాన్యం పేరుకుపోయింది. గోనె సంచుల కొరత, రవాణా వాహనాల ఆలస్యం రైతుల సమస్యలను మరింత పెంచుతున్నాయి. ఏళ్లుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ, శాశ్వత కల్లాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోవడం, నష్టపోవడం అన్నదాతను కలవరపెడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>