ధాన్యం కొనుగోళ్ల‌కు ఏర్పాట్లు పూర్తి చేయండి.. అధికారుల‌కు మంత్రి తుమ్మ‌ల ఆదేశాలు

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని, టార్పాలిన్‌లు, తేమ కొలమాని, ఆరబెట్టే యంత్రాలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు (Tummala Nageswara Rao) అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మ‌ల స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గత రెండేళ్ల‌లో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. మార్కెట్ యార్డుల్లో జీరో బిజినెస్ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గడ్డిఅన్నారం మార్కెట్‌లో చేపట్టిన ఐటీ ఇంట‌ర్‌ఫియ‌రెన్స్ పై అధికారులు మంత్రికి వివరించారు. కోహెడ మార్కెట్ పనులకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన, టెండర్లను నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకొని ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.

మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మార్కెట్ రుసుము వసూళ్లను పారదర్శకంగా, సమర్థ‌వంతంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా గత రెండేళ్ల‌లో మార్కెటింగ్ యార్డుల్లో 630 అభివృద్ధి పనుల కోసం రూ.5,68.50 కోట్ల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌న్నారు. వీటిలో రూ.128 కోట్ల‌ విలువైన 113 పనులు పూర్తయినట్లు తెలిపారు. మంత్రి తుమ్మ‌ల‌ మాట్లాడుతూ.. ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తుందని, దీని పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జీరో బిజినెస్ చేసే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేయడానికి ఉపేక్షించవద్దని, అదే విధంగా దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్ష చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, వాటి పురోగతిని రోజు వారీగా సమీక్షించేందుకు వీలుగా ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. మార్కెట్ యార్డ్‌ల‌కు వచ్చే రైతులకు సౌకర్యం కల్పించే పనులను ప్రాధాన్యత పాతిపదికన చేపట్టాలని అదే విధంగా, పంట ఉత్పత్తులు రక్షించే విధంగా చేపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించారు. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో అవసరమైతే మరికొంత మందిని వేరే శాఖల నుండి డిప్యూటేషన్‌పై తీసుకొనే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సెక్రటరీ గారిని మంత్రి కోరారు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలో ‘స్మార్ట్ మార్కెట్ యార్డ్ ‘సాఫ్ట్ వేర్‌ల‌ ద్వారా మార్కెట్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మంత్రి స్పందిస్తూ ఒక సీజన్‌లో అమలు చేసిన తర్వాత‌, ఆశాజనక ఫలితాలుంటే అన్నీ మార్కెట్ యార్డ్ కమిటీలను డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్ ను ఆరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల అభివృద్ది, నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ ప్రభుత్వం సమయానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కోహెడ పండ్ల మార్కెట్‌కు సంబంధించి ఎంపిక చేసిన ప్రదేశంలో సర్వే పూర్తయిందని, పనులను చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.

HACA ద్వారా ఐదేళ్ల సమగ్ర నిర్వహణలో వ్యవసాయ మార్కెట్ కమిటీల అంతటా విద్యుత్ బిల్లుల తగ్గించడానికి గ్రిడ్‌ను అనుసంధానం చేస్తూ సోలార్ రూప టాప్ ప్యానెల్ ల ద్వారా విద్యుత్పత్తి అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇప్పటికే ఈ దిశలో ప్రయోగాత్మకంగా 4 మార్కెట్ యార్డ్ లలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరాతీశారు. దీనికి అధికారులు సమాధానమిస్తూ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జులై చివరి కల్ల సోలార్ ప్యానెళ్లు నిర్మించి విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు.

పంట‌ల కొనుగోళ్ల‌పై…

గత ఖరీఫ్‌లో చేపట్టిన ప‌త్తి కొనుగోళ్లు పూర్తయ్యాయ‌ని, ప్రస్తుతం మార్కెట్ లలో మిర్చి అధికమొత్తంలో వస్తుందని, రైతులకు మంచి ధర దక్కేటందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌ని మార్కెటింగ్ డైరెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను కూడా ప్రారంభిస్తున్నందున‌ కొనుగోళ్లకు అవసరమైన సామగ్రి కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా టర్పాలిన్ లు, తేమ శాతం కొలిచే పరికరాలు, క్లీనింగ్ డ్రైయర్లు అవసరమైనన్ని సిద్ధంగా ఉంచాలని కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం పటిష్ట చర్యలు తీసుకోవాలని, కేంద్రాలకు తీసుకొచ్చే రైతుల ఉత్పత్తులను పరిరక్షించే విధంగా ముందుగా మార్కెట్ యార్డ్ లలో కొనుగోలు సెంట‌ర్లు ఏర్పాటు చేయాలని, అదే విధంగా రైతుల వద్ద నుండే సేకరించే మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు విడుదల చేసేందుకు, సీఎం అనుమతితో నిధులు సమకూరుస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఐఏఎస్ సురేంద్ర మోహన్, కార్యదర్శితో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్ మానేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>