కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో రాబోయే వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, దీంతో పాటు నాణ్యమైన విత్తనాలను తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (TGSDC) చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. వానా కాలం సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే అంశంపై బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈఓలు, ఎఫ్‌పీఓలు, ఏఆర్‌ఎస్‌కే ప్రతినిధులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్ రంగపేట నుంచి నాణ్యమైన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. మన రైతులు పండించిన విత్తనాలనే సేకరించి వాటిని అధునాతన ల్యాబ్‌లలో పరీక్షించి, నాణ్యత నిర్ధారణ అయిన తర్వాతే తిరిగి రైతులకు సాగు కోసం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ విత్తనాల నాణ్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. ప్రస్తుత సీజన్‌కు అవసరమైన వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నారకల్లో ప్రధానంగా బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638 జేజిఎల్ 27356 రకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దొడ్డు రకాల విషయానికి వస్తే కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010 రకాలను నిల్వ ఉంచినట్లు తెలిపారు.
వీటితో పాటు భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుమును పిల్లిపెసర రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీలర్లు ఎట్టి పరిస్థితులో సంస్థ విత్తనాలు అమ్మాల్సిందేనని సూచించారు. కేవలం రాయితీపై ఇచ్చే విత్తనాల విక్రయానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల విత్తనాలను విక్రయించాలని ఆదేశించారు. లైసెన్స్ ఉన్న ప్రతి డీలర్ తప్పనిసరిగా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను తమ తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాటిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ రైతులకు విక్రయించాలని సూచించారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సుమారు 2.8 లక్షల ఎకరాలు వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు. సుమారు 60వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. కనీసం 25 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సంస్థ ద్వారా సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాలు ప్రభుత్వ విత్తనాలను విక్రయించేందుకు పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు. “రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా రక్షణ కల్పించడంతో పాటు, నిజాయితీగా వ్యాపారం చేసే డీలర్ల హక్కులను నూతన విత్తన చట్టం కాపాడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి అటు రైతులు సంస్థ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
విత్తనాల విక్రయానికి ప్రత్యేక ప్రణాళిక – కలెక్టర్
గ్రామ గ్రామానా ప్రభుత్వ విత్తనాలను రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఇందుకోసం స్వశక్తి మహిళా సంఘాలు వ్యవసాయ అధికారులు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ విత్తనాల విక్రయం పై విస్తృతంగా గ్రామ గ్రామానా మార్కెటింగ్ నిర్వహించి పెద్ద ఎత్తున కొనుగోలు చేసేలా రైతులను అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. త్వరలో జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ విత్తనాల విక్రయం పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డిఓ కే మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి సీడ్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్ కుమార్, కరీంనగర్ ప్రాంతీయ మేనేజర్ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సబిత, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన అధికారులు శ్రీకాంత్, మౌనిక, డీలర్లు, ఎఫ్‌పీఓ మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

