కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కొనుగోళ్లలో ఆలస్యానికి నిరసనగా వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో రైతులు వరి ధాన్యానికి నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు. మంగళవారం వనపర్తి మండలం రాజాపేట గ్రామానికి చెందిన రైతులు కొత్తకోట రహదారిపై వడ్లను ఆరబోసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ చూసినా వరి ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
అన్నదాతల పడిగాపులు
రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్‌యార్డుతో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో సింగిల్ విండో చైర్మన్ రఘవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎల్లయ్య, ఉప సర్పంచ్ చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ జయరాములు, నాయకులు సుదర్శన్ రెడ్డి, మాధవ రెడ్డి, రైతులు తిరుపతయ్య, తెలుగు నారాయణ, మోహన్ రెడ్డి, సత్యా రెడ్డి, శంకర్ రెడ్డి, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

