Mobile Popup Ad
Mobile Popup Ad

పకడ్బందీగా జనగణన.. వేగంగా ధాన్య సేకరణ: కలెక్టర్ అంకిత్

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పలు ప్రభుత్వ కార్యక్రమాలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఇందులో భాగంగా మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న ‘సెన్సస్–2027’ జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను, మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్‌ను తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మల్లెలమడుగు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లతో మాట్లాడిన కలెక్టర్, వివరాల నమోదు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

స్వాతంత్ర్యం అనంతరం దేశంలో జరుగుతున్న 16వ జనగణన ఇదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో 34 ప్రశ్నలతో సర్వే నిర్వహిస్తున్నామని, ఎన్యూమరేటర్ల ఐడీ కార్డులపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు అధికారిక సిబ్బందికి సహకరించి ఖచ్చితమైన సమాచారం అందించాలని, ప్రతి ఇంటిని కవర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

​అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఉన్న 5,550 ధాన్యం బ్యాగుల నిల్వలు, రవాణా ఏర్పాట్లపై సమీక్షించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం, రికార్డు నమోదు, నిల్వ, రవాణా వంటి ప్రక్రియలు వేగంగా పూర్తి కావాలని, ఎక్కడా ధాన్యం పేరుకుపోకుండా మిల్లులకు సకాలంలో తరలించేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యతను స్వయంగా పరిశీలించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలన్నారు.

చివరగా సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్‌ను తనిఖీ చేసి, అక్కడ ఉన్న 6,000 క్వింటాళ్ల ధాన్యం నిల్వలను, మిల్లింగ్ సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, నిల్వలు పేరుకుపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి సంధ్యారెడ్డి, తహసీల్దార్ సూర్యప్రకాష్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>