కలం వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanamkonda) జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను గణనీయంగా పెంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బడిబాట పురోగతిపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కనీసం పది శాతం పెరిగేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
మూతబడిన బడులు తిరిగి ప్రారంభం..
గ్రామస్థాయిలో సర్పంచులు వార్డు సభ్యులు, మండల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, సురక్షిత వాతావరణం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో గతంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల్లోకి..
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ సౌకర్యం చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్నారి విద్యాభ్యాసంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో భవనాలకు రంగులు వేయడం, పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలకు ఆదేశాలు..
యూ డైస్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల అర్హతలు, అనుమతులు, ఫీజుల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా.. అనే విషయాలను తనిఖీ చేయాలని డీఈవో, ఎంఈవోలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు గృహాల లెక్కింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, బడిబాట కార్యక్రమ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుమా, జీసీఈవో సునీత, జిల్లాలోని 14 మండలాల ఎంఈవోలు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

